07.Oct.2018
హేతువాదం - హితవాదం
హేతువాదం అంటే ఏంటి? చాలా మంది భావిస్తున్నట్టు గా హేతువాదం అంటే దేవుడిని నమ్మక పోవడం, దేవుళ్లని తిట్టడమేనా? అసలు హేతువాదం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఇదే మైనా కొత్తగా మన దేశానికి విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న భావజాలమా? ఇలాంటి ప్రశ్నలు హేతువాదం పదం వినగానే మనలో చాలా మందికి ఉద్భవిస్తాయి. హేతువాదం ఒక తాత్విక దృక్పథం, ఎలా ఆలోచన చెయ్యాలి అని చెప్పే ఒక మార్గనిర్దేశనం, విషయాన్ని ఎలా విశ్లేషించుకోవాలో చెప్పే సాధనం.
భారత దేశం వరకూ చూసుకుంటే భారతీయ సాంస్కృతిక వారసత్వపు మూలాల్లోనే హేతువాదం ఉంది. మతాల గ్రంధాలు ఎంతో గొప్ప విగా భావించి విరాజిల్లుతున్న ఆ రోజులలో నే అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపి మత పెద్దల ఆగ్రహానికి లోనయినట్టుగా చాలా ప్రస్తావనలు, వాటి గురించిన వ్యాఖ్యానాలు మన సాంస్కృతిక వాజ్ఞ్మయం లో ఉన్నాయి.
ఉదాహరణ కి రామాయణం లో 'జబాలి' శ్రీరాముని మత విరోధమైన భావనలు బోధించినట్టు గా ప్రస్తావించబడి ఉన్నది. అరణ్యపర్వంలో ధర్మరాజుతో తన చిన్ననాటి విషయాలు ముచ్చటిస్తూ ద్రౌపది ఇలా అంది. తన చిన్ననాడు, తమతో ఉండటానికి ఒక బ్రాహ్మణుడి ని తన తండ్రి ఆహ్వానించాడని, ఆ బ్రాహ్మణుడే తన తండ్రికి, తన సోదరులకు బార్హస్పత్య భావాలను బోధించాడని, తనూ వాటిని ఆసక్తితో వినేదాన్నీఅని చెప్పింది. ద్రౌపది చెప్పిన విషయాలు విని ధర్మరాజు ఆమెను మత వ్యతిరేక భావాల ప్రభావంలో పడిపోయిందని నిందించాడు.
కౌటిల్యుడు తన ‘అర్ధశాస్త్రం’ లో సాఖ్య, యోగ శాస్త్రాలతో పాటు, లోకాయతను కూడా ఉదహరించి, దానిని ‘తర్కశాస్త్రం’ అన్నారు. బాణుని ‘హర్షచరిత్ర’లో విచ్చేసిన ఋషుల జాబితాలో ‘లోకాయత’ పేరు కూడా ఉంది. మహాభారతం’ లో శాంతి పర్వంలో ప్రసిద్దమైన చార్వాక వథ కధ ఉన్నది. మను స్మృతి, కామసూత్ర మొదలైన గ్రంధాలలో హేతువాద భావజాలాలున్న వ్యక్తులని నిందిస్తూ ప్రస్తావనలు ఉన్నాయి.
వైదిక ఆస్తిక విద్యా విధానం లో 'మీమాంస' అనేది ఆరు దర్శనాలలో ముఖ్యమైనది. వేద వేదాంగ అధ్యయనం లో మీమాంస ని పూర్తి చెయ్యని దే అధ్యయనం పూర్తి కాదు. మనం తరచుగా వాడుకునే 'యక్ష ప్రశ్న లు' అనే పదం హేతువాద దృక్పథం నుండి వెలువడిందే. హేతువాద దృక్పథం 'సత్యాన్వేషణ' చేయడానికి నమ్మకమైన సాధనం.
హేతువాదం సమాజం లోని సాటి మనుషుల శ్రేయస్సు కోరుకునే 'హిత వాదం', పవిత్ర గ్రంధాలను కాక ఈ విశ్వాన్ని ఒక గ్రంధం గా చదువుకోవడం అవసరం అని హేతువాదం సూచిస్తుంది. విశ్వం లో మన స్వీయ అనుభవం తో పెంచుకున్న అవగాహన ని ఆధారం గా చేసుకుని సత్యాన్వేషణ లో ఒక నిర్ధారణ కి రావడం కాలానికి అనుగుణం గా ఒకవేళ దానిలో మార్పు అవసరం అయితే ఆ నిర్ధారణ నుండి పక్కకు జరిగి కొత్త అవగాహనలని, పరిజ్ఞానాన్ని దానికి జోడించి సత్యాన్వేషణ లో ముందుకు సాగడం హేతువాదం యొక్క పంథా.
లోకాయుతులు, చార్వాకులు, బుద్ధుడు, మహావీరుడు దగ్గర నుండి మొదలుకుని భావ వాదానికి సమాంతరంగా హేతువాదం తన మనుగడని చాటుకున్నట్టు చరిత్ర లో ఆధారాలు ఉన్నాయి. ఈ విశ్వం లో ఒక లయ ఉన్నది, ఆ లయ మనలో కూడా ఉన్నది కాబట్టి మనం విశ్వంలో ఉన్న లయని అర్థం చేసుకోగలుగుతున్నాం అని భావ విప్లవకారులు చెప్పారు. అంటే 'విశ్వం తో మమేకం కావడం కోసం హేతువు ని వాడాల్సిన అవసరం ఉంటుంది' అని అర్థం.
హేతువాద దృక్పథం, భౌతిక వాదం యొక్క పునాదుల పైన నిర్మించబడి ఉంటుంది. ఈ విశ్వం లో నిరూపించ బడినదే ఉంది, లేనిది ఎక్కడా లేదు, అనే టువంటి తాత్విక ధోరణి మాత్రమే సమాజానికి ఉపయోగ పడుతుంది అని హేతువాదం చెప్తుంది. ఇక్కడే హేతువాదానికి దేవుడు అనే నమ్మకానికి మధ్య సంఘర్షణ ఉంటుంది. హేతువాదం కేవలం దేవుడిని దూషించడం మాత్రమే లక్ష్యం గా పనిచేయదు. మనం ప్రతీ నిత్యం అవలంబించే ప్రతీ పద్ధతి లోనూ, చేసే ప్రతీ ఒక్క కార్యక్రమంలో లో హేతుబద్ద పద్ధతి అనే ఐచ్ఛిక ప్రత్యామ్నాయం ఉంటుంది.
భారతీయ సమాజం లో గానీ, లేదా ప్రపంచం లో ఏ నాగరిక సమాజం లో నైనా గాని మంచి దిశ గా సమాజం ముందడుగు వేసింది అంటే అది హేతుబద్ద మైన ఆలోచన వల్ల మాత్రమే జరిగింది. వాస్తవాల ఆధారం గానే నమ్మకాలు ఏర్పరచుకోవాలి అని, అలాగే సమాజం లో మనతో ఏకీభవించని ప్రతీ ఒక్కరికి కూడా మనతో సమానం గా వారి వారి అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ ఉండే విధం గా సమాజ నిర్మాణం జరగాలన్న భావనలు హేతువాదం లో ఉంటాయి.
కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి, మానవాళి యొక్క ప్రాథమిక లక్ష్యం గా ఉన్నప్పుడు అవి తెలుసుకున్న కారణం గా మన జీవన విధానం ఎలా మెరుగు పరచుకోవచ్చు అని ఆలోచన చేసుకుని ఆ దిశగా సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్లడం, అందరికీ ప్రాధమికం గా ఒకే రకమైన చట్టాలను, విలువలను, అవకాశాలను వర్తింపజేయడం అనే సూత్రీకరణ ఆధారం గా సమాజ నిర్మాణం జరగాలని హేతువాదం చెప్తుంది.
- విశ్వనాధ్ జయంతి
ఏది జరిగినా
ReplyDeleteఅలా ఎందుకు జరుగుతుంది ?
ఇలా ఎందుకు జరగడం లేదూ ?
ఇలా జరిగితే ఏమై ఉండేది !
కా ప్రతి దానికి కారణం / హేతువు తెలుసుకోవడమే
హే తు వా దం.
కారణానికి వచ్చే సమాధానమే నిజమైన సమాధానం, అది భౌతికవాద సమాధానం.
ఇందులో దైవం ప్రస్తావనే లేదు.
అసలు హేతువాదానికి దైవానికి ప్రత్యక్ష సంబంధం లేని లేదు. ఇది కచ్చితంగా గమనించదగ్గ విషయం