Tuesday, 30 June 2020

యుద్ధం వద్దు

యుద్ధం వద్దు
◆◆◆◆◆◆

మాకు యుద్ధం వద్దు. అది మీరు అంటున్న సాంప్రదాయక యుద్ధం అయినా, ఆర్ధిక - వాణిజ్య పరమైన యుద్ధం అయినా లేదా పక్కదేశంతో మరే రూపం లో ఉన్నా, మాకు యుద్ధం వద్దు.

ఈ రోజు దేశం లో ప్రతీ పౌరుడూ వారి జీవితాలలో జీవన విధాన అభివృద్ధి సూచిక/(Quality of life index) మెరుగు పడాలని కోరుకుంటున్నాడు. అలాగే దేశం లో ప్రతీ పౌరుడికి మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయాలు, ప్రతీ చిన్నారికి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్య సమకూరాలి అని కోరుకుంటుంన్నాడు.

ఈరోజు ప్రపంచం లో మీరు చెప్తున్నట్టుగా సామ్రాజ్య వాద భావనలు లేవు. అలాగే ప్రపంచంలో ఏ అభివృద్ధి కాంక్ష ఉన్న దేశమైన యుద్దాన్ని కోరుకోదు.

ఈ రోజు దేశం మహమ్మారి బారిన పడి దిక్కుతోచని పరిస్థితి లో ఉంది. మిలాన్ లో జరిగినట్టు కోవిడ్ పేషంట్ లని చికిత్స చేసే ముందు లో బ్రతికే అవకాశం ఉన్నవాళ్ళని ఎన్నుకుని వారికే చికిత్స అందించే లాంటి దుస్థితి  మనదేశం లో రాకుండా తీసుకోవాలిసిన జాగ్రత్తలు ఏమిటి అని ఆలోచించాలిసింది పోయి, యుద్ధోన్మాదం రగిలించే ప్రయత్నాలు వద్దు.

3 సార్లు కఠినమైన lockdown అమలు చేసినా కూడా వ్యాధిని కట్టడి చెయ్యలేక పోయాం. బాధ్యతని, భారాన్ని అంతా ప్రజానీకం పైన పడేసి చేతులు దులుపుకున్నాం. కరోనా వస్తే చస్తారు అనే స్థాయి నుండి, మీ చావు మీరు చావండి అనే వరకూ దాదాపు 90 రోజుల ప్రయాణం లో ప్రజలుగా చాలా నేర్చుకుంన్నాం! చాలా అర్థం చేసుకున్నాం!

వ్యవస్థ లోని డొల్లతనం తో పాటు, మాటలకి చేతలకీ పొంతనలేని విధంగా ఉన్న ప్రతీ చర్య మాకు గుర్తుంది.
వైద్య పరమైన అత్యవసర పరిస్థితిని, పోలీసు చర్య తో అణగదొక్కిన సంఘటనలు మేం మర్చిపోలేం.
వేల కిలోమీటర్లు నడిచిన వలస కార్మికుల పాద ముద్రల రక్తపు మరకలు రోడ్ల పైన చెరిగిపోవచ్చు. కానీ, మా గుండెలలో వారి అడుగుల శబ్దం లబడబ్ అని ప్రతిక్షణం ప్రతిధ్వనిస్తోంది.  కరోనా కట్టడిలో ప్రపంచమంతా మిమ్మలిని కీర్తిస్తోంది అని చెప్పి మమ్మలిని మభ్యపెడుతునారాన్న నిజం నిలకడ మీద, నియంత్రణ లేకుండా పెరుగుతున్న కేసులు - మరణాల సంఖ్య చూసి అందరికీ అర్థం అవుతోంది. ఆత్మ నిర్భరమని ప్రకటించిన ప్యాకేజీ ని నమ్మి మమ్మలి మేము ఆత్మ వంచన చేసుకోవాలని అనుకోవడం లేదు.

ఒక టాల్ లీడర్ గా, గొప్ప నాయకత్వ లక్షణాలున్న నాయకునిగా మిమ్మలిని జనం పొగుడుతుంటే ఉత్సాహపడ్డామ్. నాకోసం 50 రోజులు ఇవ్వండి అంటే మరో ప్రశ్న కూడా అడక్కుండా రోజుల తరపడి మేం చెయ్యని తప్పుకు ATM ల దగ్గర లైన్ లో నిలుచున్నాం. అంతెందుకు నిన్నటికి నిన్న చప్పట్లు కొట్టాం, దీపాలు పెట్టాం, పూలుజల్లామ్, సన్మానాలు చేసాం. మీ ప్రతీ అడుగులో మీ మాటలని నమ్మి మీ వెనుక నడిచాం. మీరేం చేసినా దేశం కోసం అనే పిచ్చి ని మా తలకెక్కించుకుని ఊరేగామ్.

మీ భాషకి అర్థాలు ఇప్పుడిప్పుడే సరిగ్గా మాకు అర్థం అవుతున్నాయి. బీహార్ రెజిమెంట్ త్యాగాలను మీరు పొగిడారు అంటే రాబోయే బీహార్ ఎలక్షన్ లో మా పార్టీకి ఓటు వెయ్యండి అని మీరు అన్నట్టుగా అర్థం చేసుకున్నాం. ఒకదేశ ప్రధాని స్థాయి లో ప్రాంతాల వారీ రెజిమెంట్స్ ని ఎన్నికల కోసం వాడుకోవడం బహుశా ఈ స్వతంత్ర భారతం లో ఇదే మొదటి సారి కావచ్చు.

కానీ ఇప్పుడు బాయ్ కాట్ చైనా అంటూ, ద్రోహి చైనా అంటూ మీరు చేసే ప్రచారం చూస్తే రాబోయే విపత్తుని తలచుకుని భయపడుతున్నాం. మాకు చైనా వారి మీద కోపంలేదు, ఆ మాటకొస్తే, ప్రపంచం లో ఈదేశం పైనా కోపం లేదు. మీడియా ద్వారా మీదగ్గర ఉన్న సామాజిక మాధ్యమ వ్యవస్థ ద్వారా, మాకు రోజుకో శత్రువు ని చూపించద్దు. గత తొంభై రోజుల్లోనే, మొదట తబ్లిక్ ముస్లిమ్స్ ని, తరువాత, పాకిస్తానీ చొరబాటు దారులని, బంగ్లాదేశ్ ని, నేపాల్ ని ఇప్పుడీ చైనా ని. ప్రపంచంలో నే శక్తివంతమైన లీడర్ గా చెప్పుకున్న మీ దౌత్య విధానం సరిగ్గా ఉంటే ఈరోజు ఇంతమంది శత్రువులు ఎలా తయారు అయ్యారు అని మేం ఇప్పుడు అడగం. విదేశాంగ మంత్రి కన్నా ఎక్కువ గా దేశాలు పట్టి తిరిగిన, ఒక tough negotiator గా తాకదు పుచ్చుకున్న మీ సామర్ధ్యాన్ని మేం శంకించం.

ఇక చాలు, ఎన్నికల కోసం యుద్దాలు చెయ్యద్దు. మీ గెలుపు కోసం మమ్మలిని ఓడించద్దు. ఇక పైన మీ స్వార్థం కోసం ఒక్క సైనికుడిని కూడా కోల్పోవడం మాకిష్టం లేదు. 5 ట్రిలియన్ ఎకానమీ గురించి అడుగుతామేమో అని భయపడి చైనా ఎకానమీని దెబ్బతీస్తామని చెప్పకండి. ఇప్పటికే చిల్లులు పడిన మా జేబులని చింపకండి.

- Viswanadh Jayanthi

No comments:

Post a Comment

Tips to make online education more utilitarian

  Tips to make online education more utilitarian 1.     Serious Learning Approach:   When you are attending online classes, you need m...